: క్రికెట్ మ్యాచ్ లో ఉసేన్ బోల్ట్... రన్నింగ్ లో యువరాజ్ గెలుపు


జమైకా చిరుత... పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ స్టార్ బ్యాట్స్ మన్ అయ్యాడు.. బ్యాటింగ్ స్టార్ యువరాజ్ పరుగుల వీరుడయ్యాడు. తమ బ్రాండ్ అంబాసిడర్లయిన యువరాజ్, బోల్ట్‌ను ప్యూమా సంస్థ ఒకే వేదిక పైకి తీసుకువచ్చి క్రీడాభిమానులకు మరిచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది. ‘బోల్ట్‌ అండ్‌ యువీ- బ్యాటిల్‌ ఆఫ్‌ లెజెండ్స్‌’ ఈవెంట్ వినోదానికే సరికొత్త నిర్వచనం ఇచ్చి గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మంగళవారం సాయంత్రం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన స్నేహపూర్వక ‘సెవెన్‌ ఎ సైడ్‌’ క్రికెట్‌ మ్యాచ్‌లో బోల్ట్‌ టీమ్‌ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన యువీ జట్టు నాలుగు ఓవర్లలో 58 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బోల్ట్‌ (19 బంతుల్లో 45) విరుచుకుపడ్డాడు. చివరి రెండు బంతుల్లో పది పరుగులు చేయాల్సిన సమయంలో ఆదిత్య తారే బౌలింగ్‌లో ఐదో బంతిని బోల్ట్ భారీ సిక్సర్‌ కొట్టాడు. అయితే ఆఖరి బంతిని బోల్ట్‌ మిస్‌ చేశాడు. కానీ ఈమ్యాచ్ కు నిర్వాహకుడిగా వ్యవహరించిన అజయ్‌ జడేజా ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించి మరింత సరదాకు కారణమయ్యాడు. ఫ్రీ హిట్‌ తీసుకున్న బోల్ట్‌ మరో భారీ సిక్సర్‌తో తన జట్టును గెలిపించాడు. బోల్ట్‌ బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపూ ప్రేక్షకులు కేరింతలతో మద్దతు తెలిపారు. ఇక మ్యాచ్ అనంతరం నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో యువరాజ్‌ విజయం సాధించాడు. క్రికెట్‌ మ్యాచ్ లో నెగ్గిన బోల్ట్, స్ప్రింట్ లో సరదాగా కావాలని యువీ వెనుక పరిగెత్తి విజయాన్ని యువీకి వదిలివేశాడు.

  • Loading...

More Telugu News