: తెలంగాణ రాష్ట్రంలో పీటముడిగా మారుతోన్న రుణమాఫీ హామీ వ్యవహారం


రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ఓ స్పష్టత ఇవ్వగా... తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో రుణ మాఫీ వ్యవహారం రోజు రోజుకు పీటముడిగా మారుతోంది. ఆదిలాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో రుణాల రీషెడ్యూల్‌కు భారతీయ రిజర్వు బ్యాంకు ఇప్పటికే అంగీకరించింది. మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల రైతుల రుణ మాఫీపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ ఆరు జిల్లాల్లో రూ.30 వేలలోపు ఉన్న రుణాలను వడ్డీ సహా వెంటనే చెల్లించి, సదరు రైతులకు కొత్త రుణాలను జారీ చేయించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక్కడకు వరకు బాగానే ఉంది గానీ, రూ.30 వేల కంటే ఎక్కువగా రుణం తీసుకున్న రైతుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. వీరికి బాండ్లను జారీ చేసి.. భవిష్యత్తులో ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందనే భరోసా కలిగించడం ద్వారా రైతులే పాత రుణాన్ని చెల్లించి, కొత్త రుణం తీసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం ముందు భావించింది. అయితే... బాండ్లను జారీ చేస్తే.. రైతులపై ఉన్న రుణ భారమంతా సర్కారు ఖాతాలోకి మారి.. రాష్ట్ర ప్రభుత్వ అప్పు పరిమితి దాటిపోయే ప్రమాదం ఏర్పడుతుండటంతో.. ఈ ప్రతిపాదనను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తాజాగా నిన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి వి.నాగిరెడ్డి అధ్యక్షతన తెలంగాణ బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ.30 వేల కన్నా ఎక్కువ అప్పు ఉన్న రైతులు తమ పేరిట ఉన్న మొత్తం రుణాన్ని చెల్లిస్తేనే కొత్త రుణం మంజూరు చేయడానికి వీలవుతుందని బ్యాంకర్లు స్పష్టం చేశారు. దీంతో మధ్యే మార్గంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదనను రెడీ చేసింది. దీని ప్రకారం రూ.30 వేల కన్నా ఎక్కువ రుణం తీసుకున్న రైతులు ప్రస్తుతానికి వారే బాకీ కట్టేలా బ్యాంకర్లు ఒప్పించాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతానికి రైతులు బాకీ కట్టేస్తే... ఆ తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వం రైతుకి తిరిగి చెల్లిస్తుందని స్పష్టం చేసింది. రుణమాఫీపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలో లక్ష రూపాయలలోపు రుణాలను చెల్లిసామని హామీ ఇచ్చింది. ఆ జీవోను హామీ పత్రంగా భావించేలా రైతులకు నచ్చజెప్పాలని బ్యాంకర్లకు ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఈ ప్రకారం పాత రుణం చెల్లించి... కొత్త రుణం తీసుకున్న రైతులకు ప్రభుత్వం వీలైనంత త్వరగా మూడు విడతల్లో మొత్తం చెల్లింపులను నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్ లోనే జమ చేస్తుంది. తొలి విడతగా 30 వేల రూపాయల వరకు లేదా 20 నుంచి 30 శాతం వరకు.. వారి అకౌంట్లకే నేరుగా జమ చేస్తుందని... మిగిలిన మొత్తంలో సగాన్ని 2015-16 లో, చివరి సగాన్ని 2016-17 లో ప్రభుత్వం రైతులకి చెల్లిస్తుందని బ్యాంకర్లు వారికి నమ్మకం కలిగేలా తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది. రైతులకు ఈ ప్రతిపాదనపై విశ్వాసం కలిగించి పాత రుణాలను చెల్లించి కొత్త రుణాలను తీసుకునేలా బ్యాంకులే వారికి నచ్చచెప్పాలంటూ సోమవారం నాటి సమావేశంలో ఆ బాధ్యతను వారికే ప్రభుత్వం అప్పజెప్పింది.

  • Loading...

More Telugu News