: కేరళలో పట్టు దిశగా బీజేపీ అడుగులు


ఇప్పటికి చాలా సార్లు బీజేపీ చేసిన యత్నాలు కేరళలో ఫలించలేదు. ఎప్పటికప్పుడు ఆ పార్టీకి కేరళలో ఎదురుదెబ్బే తగులుతోందని చెప్పే కంటే అసలు అక్కడ కాలుమోపేందుకు కూడా అవకాశం చిక్కలేదు. దీంతో ఎలాగైనా కేరళలో తొలి అడుగు వేసి తీరాల్సిందేనన్న దృఢ సంకల్పంతో పార్టీ చీఫ్ అమిత్ షా కేరళలో పర్యటిస్తున్నారు. ఆదివారం కేరళ చేరుకుని పద్మనాభ స్వామి వారిని దర్శించుకున్న ఆయన, సోమవారం కూడా పలు కార్యక్రమాల్లో పాల్పంచుకోనున్నారు. ఆదివారం నాటి పర్యటనలో భాగంగా పార్టీకి చెందిన కీలక నేతలతో షా భేటీ అయ్యారు. పార్టీని రాష్ట్రంలో పాదుకొల్పేందుకు గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కావడమొక్కటే మార్గమని ఆయన ఉద్బోధించారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. సోమవారం నాటి పర్యటనలో భాగంగా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహించనున్న కీలక సమావేశంలో పాల్గొనే షా, 6 వేల మంది పార్టీ ముఖ్యులనుద్దేశించి ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న వర్గాలను తమ దరికి చేర్చుకునేందుకు షా ప్రత్యేక కార్యాచరణను పార్టీ శ్రేణులకు వెల్లడించనున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ లో ఒంటిచేత్తో పార్టీకి మునుపెన్నడూ లేని విధంగా అఖండ విజయాన్ని సాధించి పెట్టిన షా, కేరళలోనూ మంచి ఫలితాలనే రాబడతారని ఆ పార్టీ కార్యకర్తలు అంచనాలేస్తున్నారు.

  • Loading...

More Telugu News