: జపాన్ లో పురాతన బౌద్ధ ఆలయాన్ని సందర్శించిన మోడీ
ఐదు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ, రెండో రోజైన ఆదివారం అక్కడి టోజీలోని పురాతన పగోడా బౌద్ధాలయాన్ని సందర్శించారు. జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి ఆలయానికి చేరుకున్న మోడీ, చెక్కతో ఐదు అంతస్తులుగా నిర్మించిన ఆలయాన్ని ఆసక్తిగా తిలకించారు. ఆలయ నిర్మణానికి ముగ్ధుడైన మోడీ, అక్కడే అరగంటకు పైగా గడిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్త్యం గురించి అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ఎనిమిదో శతాబ్ధానికి చెందిన ఆలయ వివరాలను ప్రధాన బౌద్ధ భిక్షువు మోడీకి వివరించారు. భారత ప్రధాని తమ బౌద్ధాలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని అక్కడి బౌద్ధ భిక్షువులు తెలిపారు.