: 2జీ ఛార్జ్ షీట్ లో మారన్ సోదరుల పేర్లు
2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల కేసులో తమిళనాడుకు చెందిన మారన్ సోదరులపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రత్యేక కోర్టులో శుక్రవారం దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, కళానిధి మారన్, మలేసియాకు చెందిన వ్యాపార వేత్త ఆనంద కృష్ణన్ లతో పాటు మరో ఐదుగురి పేర్లను సీబీఐ చేర్చింది. ఎయిర్ సెల్ - మాక్సిస్ ఒప్పందంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ సుదీర్ఘంగా శోధన జరిపి, ఎట్టకేలకు శుక్రవారం దీనికి సంబంధించిన ఛార్జ్ షీటును దాఖలు చేసింది. కేంద్ర మంత్రి పదవిలో ఉండగానే దయానిధి మారన్ పై సీబీఐ కేసు నమోదు చేయనుందన్న వార్తల నేపథ్యంలో నాడు కలకలం రేగిన సంగతి తెలిసిందే. సీబీఐ తాజా ఛార్జ్ షీట్ తో ఈ కేసులో చిక్కుకున్న డీఎంకే ముఖ్య నేతల సంఖ్య మూడుకు చేరింది. నాటి టెలికాం మంత్రి రాజాతో పాటు కరుణానిధి తనయ కణిమొళి కూడా ఇదివరకే ఈ కేసులో జైలుకెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా దయానిధి మారన్ పేరు కూడా ఛార్జ్ షీట్ లో చోటుచేసుకోవడంతో ఆయన కూడా జైలుకెళ్లే అవకాశాలున్నాయన్న వదంతులు వినిపిస్తున్నాయి. సీబీఐ తాజా ఛార్జ్ షీటుపై ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ షైనీ వచ్చే నెల 11 నుంచి విచారణ మొదలు పెట్టనున్నారు.