: బీసీసీఐకి పాక్ క్రికెట్ చీఫ్ హితవు
ప్రపంచ క్రికెట్ 'పవర్ హౌస్' భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నూతన చీఫ్ షహర్యార్ ఖాన్ హితవు పలికారు. ఐసీసీలో మరింత ప్రజాస్వామ్యం నెలకొనేలా బీసీసీఐ ప్రోత్సాహకర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో కలిసి ఐసీసీపై పెత్తనం చేయడం మానుకోవాలని సలహా ఇచ్చారు. ఐసీసీ సభ్య దేశాలన్నింటికి సమాన హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. భారత్-పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపైనా ఖాన్ మాట్లాడారు. యాషెస్ సిరీస్ కంటే భారత్-పాక్ సిరీసే రంజుగా ఉంటుందని ఎక్కువమంది అభిప్రాయపడుతుంటారని తెలిపారు. దురదృష్టవశాత్తూ భద్రతా కారణాల రీత్యా రెండు జట్ల మధ్య సిరీస్ లు సాధ్యం కావడం లేదని అన్నారు. యూఏఈ వంటి తటస్థ వేదికపై సిరీస్ నిర్వహణ గురించి అయితే ఆలోచించగలమని పేర్కొన్నారు.