: ఉమేశ్... ఇంగ్లండ్ పాలిట కొత్త విలన్, ఎందుకంటే..!
టీమిండియా పేసర్లలో వేగంగా బంతులు విసురుతాడని ఉమేశ్ యాదవ్ కు పేరుంది. ముఖ్యంగా, ఈ యూపీ యువకెరటం విసిరే యార్కర్లు ప్రమాదకరం. ఆదమరిస్తే కాలివేళ్ళు చితికిపోతాయని అతని బారినపడిన బ్యాట్స్ మన్ ఎవరిని అడిగినా చెబుతారు. ఇప్పుడు వన్డే సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ శిబిరంలో ఉమేశ్ విషయమై కాసింత ఆందోళన నెలకొంది. అతడి యార్కర్ లెంగ్త్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు వారు ప్రణాళికలు రచించడంలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా, ఐపీఎల్ సందర్భంగా స్వింగ్ సుల్తాన్ వసీం అక్రం వద్ద శిష్యరికం ఉమేశ్ ను మరింత రాటుదేల్చింది. మామూలుగా వేగానికి ప్రాధాన్యతనిచ్చే ఉమేశ్ కు అక్రం చిట్కాలు ఎంతగానో ఉపకరించాయి. యార్కర్ ను సంధించేటప్పుడు దృష్టంతా బ్యాట్స్ మన్ పాదంపైనే ఉంచాలని, శరీరం మొత్తం బరువును విడుదల చేయబోయే బంతికి బదలాయించాలని అక్రం సలహా ఇచ్చాడట. ఆ సూచనలు సత్ఫలితాలనిచ్చాయని ఉమేశ్ చెబుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే ఆసీస్ 'ఏ' జట్టుపై 5 వికెట్ల ప్రదర్శన తనలో మరింత ఆత్మవిశ్వాసం పాదుకొల్పిందని చెప్పుకొచ్చాడు. బీసీసీఐ.టీవీ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇంగ్లండ్ తో సిరీస్ లో యార్కర్లను ఎక్కువగా ప్రయోగిస్తానని స్పష్టం చేశాడు. కాగా, యార్కర్లకు కాలం చెల్లిందన్న వాదనను ఉమేశ్ ఖండించాడు. ఇప్పటికీ బౌలర్ల అమ్ములపొదిలో యార్కర్ కు ప్రత్యేకస్థానముందని పేర్కొన్నాడు. కచ్చితత్వంతో సంధించగలిగితే యార్కర్ ను మించిన ఆయుధం మరొకటి లేదని అభిప్రాయపడ్డాడు.