: 'ఐస్ బకెట్' కు పోటీగా హైదరాబాదులో 'రైస్ బకెట్ చాలెంజ్'
ఐస్ బకెట్ చాలెంజ్... ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిది హాట్ టాపిక్. నాడీ సంబంధ వ్యాధిపై అవగాహన కలిగించడమే ఆ చాలెంజ్ ముఖ్యోద్దేశం. ఈ సవాల్ కు పోటీగా హైదరాబాదుకు చెందిన మంజులత కళానిధి అనే మహిళ ఫేస్ బుక్ లో 'రైస్ బకెట్ చాలెంజ్'ను ప్రారంభించారు. నిరుపేదలకు సహాయపడడమే ఈ లోకల్ చాలెంజ్ లక్ష్యం. ఈ చాలెంజ్ లో భాగంగా ఓ బకెట్ నిండుగా ఉన్న బియ్యాన్ని కొనడం గానీ, లేక, ఆ బియ్యాన్ని వండి పేదలకు అన్నదానం గానీ చేయాల్సి ఉంటుంది. రూ.100 విలువైన ఔషధాలు కూడా సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి విరాళంగా ఇవ్వొచ్చట. దీనిపై మంజు తన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. మన కళ్ళెదుట నిలిచిన పేదరికం వంటి సమస్యలకు ఇది 'లోకల్, దేశీ పరిష్కారం' అని ఆ పోస్టులో పేర్కొన్నారు. మంజులత ఆశయం పట్ల ఫేస్ బుక్ యూజర్లలో స్పందన బాగానే కనిపిస్తోంది. దీనిపై పలువురు స్పందించి, తమ తమ ప్రాంతాల్లో తోచిన మేర సాయం చేస్తున్నారట.