: విజయ్ మాల్యా సామ్రాజ్యం కూలుతోంది!


మద్యం వ్యాపారంతో ఆకాశానికెగిసిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, ఎయిర్ లైన్స్ వ్యాపారం చేపట్టి బొక్కబోర్లా పడ్డారు! కింగ్ ఫిషర్ పేరిట ఏర్పాటు చేసిన విమానయాన సంస్థ నిర్వహణతో ఆయనకు తల బొప్పి కట్టింది. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఆ సంస్థను మూసివేశారు. గోరుచుట్టిపై రోకటిపోటులా... మద్యం వ్యాపారంలో సైతం ఇప్పుడు మాల్యాకు కడగండ్లు తప్పడంలేదు. బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణాలు ఈ లిక్కర్ కింగ్ ను వెక్కిరిస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు ఆయనకు మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) మాల్యాను (విల్ ఫుల్ డిఫాల్టర్) ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా పేర్కొంది. యూబీఐ బాటలోనే ఐడీబీఐ, ఎస్ బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు కూడా ఈ బడా వ్యాపారవేత్తను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాగా, యూబీఐ తనను 'విల్ ఫుల్ డిఫాల్టర్'గా పేర్కొనడంపై మాల్యా కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. వచ్చే వారం దీనిపై కోర్టు తీర్పు ఇవ్వనుంది. న్యాయస్థానం గనుక బ్యాంకు చర్యను సమర్థిస్తే మాల్యా కష్టాల్లో పడతారు. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) చైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News