: పనితీరు ఆధారంగా సుప్రీం చీఫ్ జస్టిస్ ను ఎంపిక చేయండి: కట్జూ వ్యాఖ్య


జస్టిస్ మార్కండేయ కట్జూ వివాదాలకు నెలవు. న్యాయమూర్తుల ఎంపికలో, సీనియర్ న్యాయమూర్తులు ఏ తరహాలో వ్యవహరిస్తారన్న విషయంపై ఇటీవల పలు రకాల వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్త చర్చకు తెర తీసిన ఆయన, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రాతిపదికపై తాజాగా నోరు విప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేసే వ్యక్తిని సీనియార్టీ ప్రాతిపదికగా కాకుండా పనితీరు ఆధారంగా ఎంపిక చేయాలని ఉచిత సలహా ఇచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా వచ్చే నెల 27న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కట్జూ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. "ఇప్పటిదాకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ మోస్ట్ న్యాయమూర్తినే నియమిస్తూ వస్తున్నారు. ఈ పద్ధతినే అవలంబించాలంటూ రాజ్యాంగ నిబంధనేదీ లేదు. అయినా ఇదే పద్ధతిని ఏళ్ల తరబడి పాటిస్తున్నారు. అయితే దీని కారణంగా న్యాయవ్యవస్థకు కొన్ని సందర్భాల్లో తీరని నష్టం వాటిల్లుతోంది. దీనికి చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సీనియార్టీ బదులు పనితీరును ఆధారం చేసుకుని ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల ఎంపిక కోసం పనిచేస్తున్న కోలీజియం రద్దుకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకున్న దరిమిలా, ఎవరూ అడగకుండానే కట్జూ, తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

  • Loading...

More Telugu News