: కోల్ గేట్ స్కాంలో కొన్ని పేర్లను తొలగించమని ఒత్తిడి చేశారు:మాజీ కాగ్ వినోద్ రాయ్


అక్రమ బొగ్గు కుంభకోణం వివాదంలో కొందరి పేర్లను తొలగించాలని రాజకీయ నేతలు కొందరు తనపై ఒత్తిడి తెచ్చారని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ బాంబు పేల్చారు. ఇప్పటికే పలు అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామం ఊహించని షాకిచ్చింది. కోల్ గేట్ కుంభకోణంతో పాటు కామన్వెల్త్ క్రీడల అవినీతి విషయంలోనూ పాలుపంచుకున్న కొందరు నేతల పేర్లను నివేదికల నుంచి తొలగించాలని తనపై ఒత్తిడి వచ్చిందని ఇటీవల వ్యాఖ్యానించారు. తాము చెప్పినట్లు వింటే, భారీ మొత్తంలో నగదు ముట్టజెబుతామని కూడా సదరు నేతలు కొందరు తన నివాసానికి వచ్చి మరీ బంపర్ ఆఫర్ ప్రకటించారని కూడా ఆయన వెల్లడించారు. అయితే ఎంత మొత్తం ఆఫర్ చేశారన్న విషయాన్ని వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. ‘నాట్ జస్ట్ యాన్ అకౌంటెంట్’ పేరిట రాస్తున్న పుస్తకంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలను ఆయన వెల్లడించనున్నారు. 2జీ స్కాం కోల్ గేట్, కామన్వెల్త్ క్రీడల అవినీతి తతదితర అంశాలపై తన పుస్తకంలో రాయ్ సమగ్ర వివరాలను బయటపెట్టనున్నారు. పదవిలో కొనసాగేందుకు మన్మోహన్ సింగ్ ఏ తరహాలో వ్యవహరించారన్న విషయాలపైనా రాయ్ స్పందించే అవకాశాలున్నట్లు సమాచారం. "ఏ రీతిన వివరాలను వెల్లడిస్తానన్న విషయాన్ని పక్కనబెడితే, సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తి, నిర్ణయం తీసుకున్నారా? లేదా? అన్న విషయాలను మాత్రం ఖచ్చితంగా వెల్లడిస్తానని మాత్రం చెప్పగలను" అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో యూపీఏ అవినీతి భాగోతంలో నాటి ప్రధాని మన్మోహన్ పాత్రపై రాయ్ పరోక్షంగా స్పందించారని తెలుస్తోంది. సెప్టెంబర్ 15న ఈ పుస్తకం విడుదల కానుంది.

  • Loading...

More Telugu News