: బ్రూనైలో ఆందోళనలు... సుబ్రతా రాయ్ బెయిల్ కు అడ్డంకులు!


అదేంటీ, బ్రూనైలో ఆందోళనలు జరిగితే, సహారా చీఫ్ సుబ్రతా రాయ్ బెయిల్ కు వచ్చిన ఇబ్బందేమిటనేగా మీ సందేహం! సుబ్రతా రాయ్ బెయిల్ పొందేందుకు, కోర్టుకు చెల్లించాల్సిన డబ్బును బ్రూనై సుల్తానే సర్దుతున్నారట. అదేంటీ, వీరిమధ్య ఆమాత్రం అవగాహన ఉంటే, సుల్తాన్ ఎప్పుడో డబ్బు సర్దేవారే అనుకుంటాం కదా. వీరిద్దరి మధ్య అంత గాఢమైన స్నేహం ఏమీ లేదు కాని, రాయ్ విక్రయానికి పెట్టిన లండన్, న్యూయార్క్ హోటళ్లను కొనుగోలు చేసేందుకు సుల్తాన్ ఆసక్తి కనబరచారట. ఈ క్రమంలో దాదాపు మూడు నెలల నుంచి రాయ్ ప్రతినిధి బృందంతో సుల్తాన్ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారట. అయితే ఇటీవల స్వలింగ సంపర్కానికి సంబంధించి సుల్తాన్ తీసుకున్న నిర్ణయంపై బ్రూనైలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దీంతో సుల్తాన్, సదరు ఆందోళనలను ఎలా నియంత్రించాలా? అన్న అంశంపైనే తన దృష్టినంతటినీ కేంద్రీకరించారట. మరి సహారా ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆయనకు సమయమెక్కడిదంటూ సహారా ప్రతినిధులు లోలోపలే తిట్టుకుంటున్నారు. తీరా డీల్ సెట్ అయ్యే సమయంలో ఈ అనుకోని ఘటన ఎందుకోనని వారు ఒకింత అసహనమూ వ్యక్తం చేస్తున్నారు. సహారా హోటళ్లకు, వాటి విలువ కంటే 45 శాతం ఎక్కువ ధరను చెల్లించేందుకు సుల్తాన్ సిద్ధపడ్డారట. అందులోనూ ఈ విక్రయ ఒప్పందానికి ఇటు సుప్రీంకోర్టుతో పాటు అటు బ్యాంక్ ఆఫ్ చైనా కూడా ఓకే చెప్పేశాయట. ఉన్నట్లుండి మొదలైన ఆందోళనలు డీల్ లో ప్రతిష్టంభనను సృష్టించగా, రాయ్ ని జైలు గోడల మధ్యే మరింత కాలం ఉండేలా చేశాయి.

  • Loading...

More Telugu News