: అసెంబ్లీలో చేసిన 'బఫూన్' వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: జగన్
అసెంబ్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన బఫూన్ వ్యాఖ్యల రగడ ఈ రోజు కూడా కొనసాగేలా ఉంది. టీడీపీ, వైసీపీ సభ్యులిరువురు ఈ విషయంలో మొండిపట్టుదలతో ఉండడంతో అసెంబ్లీలో ఈ రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు తప్పేలా లేవు. 'బఫూన్' వ్యాఖ్యలపై జగన్ తమకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. క్షమాపణలు చెప్పే వరకు సభను నడవనివ్వమని వారు మంకుపట్టు పడుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ఈ విషయంలో ఏమాత్రం తగ్గేలా కనపడటం లేదు. అసెంబ్లీ లో టీడీపీ సభ్యులపై తాను చేసిన బఫూన్ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని... నిన్న అసెంబ్లీ వాయిదాపడిన తర్వాత జగన్ స్పష్టం చేశారు. అయితే, ముందుగా తన కుటుంబంపై టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే... తాను కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని ఆయన అన్నారు. ఈ విషయంలో తాను ఎలాంటి భేషజాలకు పోదలుచుకోలేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు కూడా అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య వార్ తప్పేలా లేదు.