: 6 లక్షలు చెల్లించి పెంపుడు కోతిని విడిపించిన పాప్ స్టార్
నిత్యం లైమ్ లైట్ లో ఉండేలా చూసుకోవడం హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలకు ప్రధాన వ్యాపకం. ఏదో రూపంలో ప్రజల నోళ్లలో నానేలా చూడడం ప్రసార సాధనాల తొలి ప్రాధాన్యం. పబ్లిసిటీలో పాప్ స్టార్ జస్టిన్ బీబర్ నాలుగాకులు ఎక్కువే చదివాడు. అందుకే ఏదో వివాదం రేపడం, నలుగురి నోళ్లలో నానడం అతనికి నిత్యకృత్యం. పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తన పెంపుడు కోతి మ్యాలీకి 10 వేల డాలర్లు (ఆరు లక్షల రూపాయలు) జరిమానా చెల్లించి వార్తల్లో నిలిచాడు. గత సంవత్సరం జర్మనీ పర్యటన సందర్భంగా అనుమతి పత్రాలు సమర్పించకుండా, వ్యాక్సిన్ వేయకుండా తీసుకువచ్చారనే కారణంతో జర్మన్ అధికారులు పెంపుడు కోతిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో అనుమతి పత్రాలు సమర్పించే అవకాశం లేకపోవడంతో కోతిని బీబర్ జర్మనీలో వదిలేశాడు. అప్పట్లో దుమారం రేపిన ఈ అంశాన్ని బీబర్ సరి చేసుకున్నాడు. తాజాగా జర్మన్ అధికారులకు 10 వేల డాలర్లు చెల్లించి పెంపుడు కోతిని తీసుకెళ్లారని జర్మన్ ఫెడరల్ నేచర్ కన్సర్వేషన్ ఏజెన్సీ తెలిపింది. ఈ 10 వేల డాలర్లలో కోతికోసం 17 నెలలు పెట్టిన ఖర్చు ఉందని ఆ సంస్థ స్పష్టం చేసింది. మొత్తానికి తన ప్రవర్తనతో నిత్యం వార్తల్లో నిలిచే బీబర్ ను పెంపుడు జంతువులు కూడా వార్తల్లో నిలుపుతున్నాయి.