: కోహ్లీ, అనుష్కలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు: బీసీసీఐ
అసలే ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఇంతటి ఘోర పరాజయానికి కారణాలేమిటన్న విషయంపై అటు టీం మేనేజ్ మెంట్ తో పాటు సగటు క్రికెట్ అభిమాని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. నిన్నటిదాకా పొగడ్తలందుకున్న కోచ్ డంకన్ ఫ్లెచర్ పై విమర్శలు వెల్లువెత్తుతుండగా, రెండో సారి ప్రపంచ కప్ అందించిన ధోనీ నాయకత్వంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా బీసీీసీఐ మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. టీమిండియా ఘోర పరాజయంలో తన పాత్రేమీ లేదని చెప్పుకునేందుకు బీసీసీఐ కోహ్లీ వ్యక్తిగత నిర్ణయాల్లోకి తలదూర్చేసింది. టీమిండియా పరాజయంలో విరాట్ కోహ్లీ విఫలం ప్రధానమైనదే. అనుష్క శర్మను తోడు తెచ్చకుంటానంటూ కోహ్లీ అడగ్గానే బీసీసీఐ సరేనన్న విషయం వద్ద అందరి దృష్టి నిలుస్తోంది. దీంతో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా.., ‘‘వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ విషయం తెలిసినందునే కోహ్లీ వెంట వచ్చేందుకు అనుష్కకు అనుమతిచ్చాం’’ అంటూ బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అనుష్కను తోడు తెచ్చుకున్న కోహ్లీ, రెండు ఇన్నింగ్స్ లు బాగానే ఆడినా, ఆ తర్వాత ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.