: ఖురేషీ తరఫున హేమాహేమీ న్యాయవాదుల వాదనలు
యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్ల తొలగింపును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టిన ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ తరఫున ప్రముఖ న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఎన్డీఏను ఇరుకున పడేసేందుకు కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఖురేషీకి ఈ తరహా సహకారం అందిస్తోందన్న విమర్శలు లేకపోలేదు. మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత, యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు ఒక్కరొక్కరుగా పదవిని వదిలేయాల్సి వచ్చింది. అయితే అజీజ్ ఖురేషీ మాత్రం రాజ్ భవన్ ను వదిలేందుకు ససేమిరా అన్నారు. అయితే నేరుగా మోడీ సర్కారుపై కాలుదువ్వని ఖురేషీ, తనను దిగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన హోంశాఖ కార్యదర్శిపై గురి పెట్టారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఖురేషీ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా ఆయన తరఫున కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రులు, దేశంలోనే విఖ్యాతిగాంచిన న్యాయవాదులు కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్ లతో పాటు మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ వివేక్ టంఖా కోర్టులో వాదనలు వినిపించనున్నారు. మరి హోరాహోరీగా జరగనున్న ఈ వాదనల్లో ఎవరు గెలుస్తారో, ఈ వివాదం ఎన్ని కొత్త మలుపులకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.