: ‘సత్యం’ రాజు రూ. 2 వేల కోట్లు పోగేశారు: సెబీ
అక్రమ మార్గాలను ఆశ్రయించిన సత్యం రామలింగరాజు, తన అనుచర గణంతో కలసి రూ. 2 వేల కోట్ల మేర సంపదను పోగేశారని సెబీ వెల్లడించింది. ఇందులో రామలింగరాజు బావమరిది శ్రీనిరాజు, కొడుకు తేజరాజుల పాత్ర కూడా ఉందని ఇటీవల కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో పేర్కొంది. ఈ చార్జిషీటులో రామలింగరాజు తల్లి అప్పలనరసమ్మతో పాటు సోదరుడి భార్య ఝాన్సీ రాణిల పేర్లు కూడా చోటుచేసుకున్నాయి. సత్యం కంప్యూటర్స్ విలువేంటో స్పష్టంగా తెలిసిన రామలింగరాజు, శ్రీనిరాజులు ఉద్దేశపూర్వకంగానే కంపెనీ షేర్ల విలువను పెంచేసి, తమ వాటాలు విక్రయించి లబ్ధి పొందారని సెబీ తన చార్జీషీటులో ఆరోపించింది. తద్వారా కంపెనీ షేర్లను కొన్న సామాన్య జనాన్ని నిలువునా ముంచేశారని తేల్చిచెప్పింది. ఈ చార్జీషీటుపై విచారణ చేపట్టిన కోర్టు మరికొద్ది రోజుల్లో తీర్పు వెలువరించనుంది. సెబీ ఆరోపణలు నిజమని తేలితే, ఈ కేసులో నిందితులందరూ పదేళ్ల జైలు శిక్ష ఎదుర్కునే అవకాశం ఉంది.