: అమెరికా జర్నలిస్టు పీక కోసింది 'అతడే'నా..?
ఆటవిక రీతిలో ఐఎస్ఐఎస్ మిలిటెంట్ ఒకరు అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలీ పీకను కోయడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఫోలీ తలను మొండెం నుంచి వేరుచేసి, చేతులు వెనక్కిపెట్టి ఆ చేతుల్లో తలను ఉంచారు. బీభత్సకరంగా ఉన్న దృశ్యాలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ పాశవిక చర్య వెలుగులోకి వచ్చింది. అయితే, ఫోలీ పీక కోసిన వ్యక్తి బ్రిటన్ కు చెందిన 'జాన్' అని అనుమానిస్తున్నారు. బ్రిటీష్ జిహాదీ గ్రూపు 'ద బీటిల్స్'లో జాన్ కూడా ఓ సభ్యుడు. ప్రస్తుతం సిరియాలో ఐఎస్ఐఎస్ తరపున పోరాడుతున్న బ్రిటీష్ మిలిటెంట్లకు ఇతడే నాయకత్వం వహిస్తున్నాడు. కాగా, బందీలుగా పట్టుకున్న వారి వ్యవహారాలను పర్యవేక్షించడం 'బీటిల్స్' ప్రధానవిధి అని తెలుస్తోంది. గతేడాది ఓ బందీ విడుదలపై జరిగిన చర్చల్లోనూ 'జాన్' పాల్గొన్నట్టు సమాచారం. జాన్ విద్యాధికుడని, ఎంతో తెలివైనవాడని మిలిటెంట్ల వద్ద బందీగా ఉండి విడుదలైన ఓ వ్యక్తి పేర్కొన్నాడు. అయితే, అతివాద ఇస్లామిక్ భావాలు అతనిలో మెండుగా ఉన్నాయని తెలిపాడు. ఈ మేరకు బ్రిటన్ పత్రిక 'గార్డియన్' ఓ కథనం ప్రచురించింది. దీనిపై బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ స్పందిస్తూ, ఆ వీడియోలో ముసుగు ధరించి ఉన్న వ్యక్తి బ్రిటీష్ జాతీయుడు అన్న అభిప్రాయం బలపడుతున్నప్పటికీ, ఈ విషయంపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని పేర్కొన్నారు.