: షారూఖ్ ఖాన్ ప్రపోజ్ చేసి, ఆమె చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చాడట!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ది లవ్ మ్యారేజీ అన్న సంగతి తెలిసిందే. షారూఖ్ ముస్లిం... భార్య గౌరీ హిందూ! వేర్వేరు మతాలకు చెందినవారైనా ఆదర్శ దాంపత్యానికి మరోపేరులా నిలిచారు. ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో అడ్డంకులు.. అన్నింటినీ కలసికట్టుగా అధిగమించిన ఈ జంట మరెందరికో ఆదర్శప్రాయం. కాగా, ఢిల్లీ వాసులైన షారూఖ్, గౌరీ మంబయి రాకమునుపే స్నేహితులు. ఓ కామన్ ఫ్రెండ్ పార్టీలో ఏర్పడిన ఆ పరిచయం ముంబయి వచ్చేనాటికి ప్రేమగా మారింది. అయితే, తన మనసులో గూడుకట్టుకున్న అపురూప భావనను గౌరీ ముందుంచడం ఎలా అన్నది షారూఖ్ కు పెద్ద క్వశ్చన్ మార్కులా తయారైంది. చివరికి ఓ రోజు ముంబయి బీచ్ లో ఉండగా తన స్వీట్ హార్ట్ తో ఐ లవ్యూ చెప్పేశాడు. అంతేగాకుండా, పెళ్ళి చేసుకోమని కోరాడు. తన ప్రపోజల్ కు గౌరీ ఓకే చెప్పేయడంతో చూడాలి షారూఖ్ పరిస్థితి! వెంటనే ఆమె చేతుల్లో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడ్చేశాడట. ఆనంద భాష్పాలు మరి! ఏళ్ళ తరబడి గుండెల్లో దాచుకున్న ప్రేమకు ప్రియురాలి ఆమోదముద్ర పడడం కంటే నిజమైన ప్రేమికుడు ఇంకేం కోరుకుంటాడు? షారూఖ్ కూడా అలాంటి వ్యక్తే. అందుకే, ప్రేమకు గౌరీ పచ్చజెండా ఊపగానే, ఆమెను గట్టిగా హత్తుకుని, తన ఆనందాన్ని అశ్రువుల రూపంలో కురిపించాడు.