: విద్యార్థినులను మినీ స్కర్టులు వేసుకోమంటున్న మహిళా ప్రిన్సిపాల్
ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళా ప్రిన్సిపాల్ విద్యార్థినులను మినీ స్కర్టులు వేసుకురావాలని ఆజ్ఞాపించడం తల్లిదండ్రుల ఆగ్రహానికి కారణమైంది. ఆ పొట్టి దుస్తులు కూడా యూనిఫాంలో భాగమేనని ఆమె తన ఆదేశాలను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. వివరాల్లోకెళితే... నవాబ్ గంజ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలకు అనితా రాణి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తోంది. అయితే, నూతన విద్యా సంవత్సరం నియమావళి అనుసరించి 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థినులు తెల్లచొక్కా, గ్రే కలర్ స్కర్టులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థినుల్లో అత్యధికులు అనితా రాణి ఉత్తర్వులకు అనుగుణంగా యూనిఫాం ధరించడం మొదలుపెట్టారు. కొందరుమాత్రం పాత విధానాన్ని అనుసరిస్తూ సల్వార్ కమీజ్, చున్నీ ధరించి స్కూల్ కు రాసాగారు. దీంతో, ఆగ్రహించిన ప్రిన్సిపాల్ వారిని తీవ్రంగా మందలించింది. ఆ విద్యార్థినులు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు అనితారాణి కార్యాలయం ముంద నిరసన చేపట్టారు. అంతేగాకుండా, ఆరు నుంచి పైతరగతులకు చెందిన విద్యార్థినులకు స్కర్టుల వాడకంపై మినహాయింపు ఉందని పేర్కొంటున్న ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని వారు ప్రిన్సిపాల్ కు చూపారు. దీంతో, దిగివచ్చిన ఆ ప్రిన్సిపాల్ తన నిర్ణయాన్ని మార్చుకుంది.