: ఇకపై చిన్నారులకు కూడా అందుబాటులోకి రానున్న గూగుల్ సేవలు
గూగుల్ సేవలు చిన్నారులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నెట్ సేవలు చిన్నారులకు అందుబాటులోకి లేకుండా వయసు నియంత్రణను గూగుల్ అమలు చేసింది. అయితే 13 ఏళ్లలోపు వారికి కూడా తొలిసారిగా చట్టపరంగా జీమెయిల్, యూట్యూబ్ తదితర సేవలను ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ అందుబాటులోకి తీసుకురానున్నదని సమాచారం. ఈ సేవలను వినియోగించుకునేందుకు చిన్నారులు తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల నియంత్రణ ఉండేలా గూగుల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ‘ద టైమ్స్’ పత్రిక కథనం ప్రచురించింది. ప్రస్తుతం 13 ఏళ్ల లోపువారికి గూగుల్, ఫేస్బుక్ సేవలు అందుబాటులో లేవు. ప్రత్యేక డాష్‌బోర్డు ద్వారా కొన్ని రకాల సేవలను తల్లిదండ్రులు నియంత్రించే వెసులుబాటుతో అందుబాటులోకి తీసుకురానుంది. కాగా, ఈ కథనంపై స్పందించేందుకు గూగుల్ నిరాకరించింది. 13 ఏళ్లలోపు వారికి చట్టపరంగా గూగుల్, ఫేస్బుక్ సేవలను వినియోగించుకునేందుకు అవకాశం లేకపోయినా, చాలా మంది వయోజనులుగా పేర్కొంటూ ఈ సేవలను వినియోగించుకుంటున్న విషయం తెలిసిందే.