: వినాయక చవితి ఉత్సవాలను విజయవంతం చేయండి: నాయిని
జంటనగరాల్లో అంగరంగ వైభవంగా జరిగే గణేశ్ నవరాత్రులపై తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించింది. అన్ని శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమీక్షకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమీక్షలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి పద్మారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, పోలీస్ కమిషనర్, ఎంపీలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం తెలంగాణ హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... గణేశ్ నవరాత్రులను అందరూ కలిసి విజయవంతం చేయాలని, గణేశ్ నిమజ్జనోత్సవాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. నిమజ్జనోత్సవాలను శాంతియుతంగా పూర్తిచేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.