: 'అమ్మ హస్తం'.. అపహాస్యంపాలు!
సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 'అమ్మహస్తం' కార్యక్రమం ఆదిలోనే అపహాస్యం పాలైన ఘటన నేడు గుంటూరులో జరిగింది. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు దారులకు '185 రూపాయలకే 9 వస్తువులు' అంటూ కిరణ్ సర్కారు 'అమ్మ హస్తం' కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు ఈ కార్యక్రమాన్ని గుంటూరులో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇక్కడి విజ్ఞాన్ మందిరంలో 'అమ్మ హస్తం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి డొక్కా, జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ హాజరయ్యారు.
తొలుత మంత్రి చేతుల మీదుగా సరుకుల సంచులను కొందరికి అందించారు. అంతవరకు సభ సజావుగానే సాగింది. మంత్రి అలా వెళ్ళారో లేదో కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. సరుకులున్న సంచులు అందక కొందరు మహిళలు వేదికపైనే ముష్టి యుద్ధాలకు దిగారు. వారిని సముదాయించలేక అధికారులు తలలు పట్టుకున్నారు పాపం! చివరికి ఆ సంచులు రేషన్ దుకాణాల్లో కూడా ఇస్తారని చెబితే గానీ ఆ మహిళలు శాంతించలేదు.