: 'సర్వే'పై సర్వత్ర సందేహాలు...వివరణతో సర్కారు ప్రకటన
తెలంగాణ సర్కారు నేడు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల్లో సర్వత్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలో ప్రభుత్వం పేర్కొన్నట్లుగా పూర్తి వివరాలను అందించాల్సిందేనా అన్న సంశయంలో కూరుకుపోయిన ప్రజలకు, వారి సందేహాలను తీరుస్తూ, ప్రభుత్వం సోమవారం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు ఖాతా, పాన్ కార్డు నెంబర్లను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనా అన్న సందేహాన్ని వ్యక్తం చేసిన ప్రజలకు తప్పనిసరేమీ కాదని, ఇవ్వాలనుకుంటేనే ఇవ్వండని ప్రభుత్వ ప్రకటన తేల్చిచెప్పింది. ఆస్తులు, భూముల వివరాలను కూడా ఇష్టముంటేనే ఇవ్వండని పేర్కొంది. అత్యవసర విధులు, విద్యాభ్యాసం కోసం అందుబాటులో లేని కుటుంబ సభ్యుల వివరాలు చెబితే చాలని కూడా ఆ ప్రకటన వెల్లడించింది. అయితే అందుకు తగిన ఆధారాలను చూపించాలని కోరింది. సంక్షేమ పథకాలు అర్హులకు మాత్రమే చేరేందుకు ఈ సర్వే చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం, సమగ్ర వివరాలు వెల్లడించడం ద్వారా ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. నిర్బంధంగా వివరాలు వెల్లడించాల్సిందేనన్న ప్రభుత్వ నిర్ణయంపై పలు వర్గాల నుంచి విమర్శలు రేకెత్తిన నేపథ్యంలో సదరు నిబంధనను సడలించింది.