: విభజనలో ఏపీకి జరిగిన నష్టాన్ని కేసీఆర్ కూడా గ్రహించారు: చంద్రబాబు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో నిన్న (ఆదివారం) జరిగిన సమావేశంలో చర్చించిన విషయాలను టీడీఎల్పీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు వివరించారు. విభజన వల్ల మనకు జరిగిన నష్టాన్ని కేసీఆర్ కూడా గ్రహించారని ఆయన చెప్పారు. ఆంధ్రకు మరింత ప్యాకేజీ వచ్చి ఉంటే బాగుండేదని కేసీఆర్ అభిప్రాయపడినట్లు బాబు తెలిపారు. అంతేగాక, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కూడా మద్దతిచ్చారని చెప్పారు. ఈ క్రమంలో విభజన సమస్యలు త్వరలోనే సమసిపోయే వాతావరణం ఏర్పడుతోందని, ఇక అందరం ఏపీ అభివృద్ధిపై దృష్టి సారిద్ధామని ఆయన సూచించారు. అటు ఈరోజు అసెంబ్లీలో వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఆరోపణలపై మాట్లాడిన చంద్రబాబు, హత్యా రాజకీయాలపై దొంగే... దొంగ అని అరిచినట్టుగా జగన్ వైఖరి ఉందన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన చరిత్ర టీడీపీకి లేదని, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాలన్న వైసీపీ కుట్రను ఆయన ఖండించారు. వైసీపీ కుట్రను సమర్థంగా తిప్పికొడదామని చంద్రబాబు చెప్పారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.