: గంజాయి డోసు చాలకపోతే పాము విషం తీసుకుంటాడు!
కేరళలోని కొల్లం నగర శివార్లలో నివసించే మహిన్షా ఓ విచిత్రమైన టీనేజర్. ఈ పందొమ్మిదేళ్ళ కుర్రాడు యవ్వనారంభ దశ నుంచే గంజాయికి అలవాటుపడ్డాడు. పూర్తిగా దానికి బానిసైపోయాడు. చివరికి ఆ గంజాయి కూడా అతనికి కిక్కివ్వలేకపోయింది. దీంతో, మరింత మత్తు కోసం వేరే మార్గం పట్టాడు. రోజూ తానుండే ప్రదేశం నుంచి ఇరుంబణం వెళ్ళి అక్కడ పాము విషాన్ని తీసుకోవడం ప్రారంభించాడు. ఒక్కో కాటుకు రూ.1000 నుంచి రూ.2500 వరకు చెల్లించేవాడట. ఈ విషయం తెలుసుకున్న కేరళ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ మహిన్షాను అరెస్టు చేసింది. విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడీ కుర్రాడు. ఓ చిన్నపాముతో కరిపించుకుంటానని, దాన్ని మెల్లగా నొక్కగానే అది కాటేస్తుందని తెలిపాడు. ముఖ్యంగా, నాలుక కిందిభాగంలో కాటు వేయించుకుంటే ఆ కిక్కు ఐదారు రోజుల వరకు ఉంటుందని అంటున్నాడు. కాగా, ఆ పాము యజమానిని కూడా గుర్తించామని, త్వరలోనే అతన్నీ అరెస్ట్ చేస్తామని ఎక్సైజ్ సీఐ సురేశ్ తెలిపారు. ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం ద్వారా పాము విషంతో కిక్కు గురించి తెలుసుకున్నానని మహిన్షా చెప్పాడు.