: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచే... అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార, విపక్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశాలు ఆగస్ట్ 18 నుంచి సెప్టెంబర్ 12 వరకు జరగాలి. కానీ, తెలంగాణ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయంపై నిన్న (ఆదివారం) జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చ కూడా జరిగింది. దీంతో, సమావేశాలను కుదించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 6 వరకు కొనసాగనున్నాయి. అధికారపక్ష టీడీపీ, ప్రతిపక్ష వైకాపాల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగనున్నాయి. రైతు రుణమాఫీతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రతిపక్ష వైకాపా విరుచుకుపడనుంది. ఈ క్రమంలో తమ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇప్పటికే మార్గనిర్దేశం చేశారు. మరోవైపు, వైకాపాను కట్టడి చేయడానికి అధికారపక్షం కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది.