: రూ.300 కోసం ఘర్షణ... ఇద్దరు మృతి
కేవలం రూ.300 ఆరుగురిని కలబడేలా చేశాయి, ఇద్దరి మరణానికి కారణమయ్యాయి. ఓ వ్యక్తిని తీవ్ర గాయాలపాల్జేశాయి. పడమటి ఢిల్లీలోని సుల్తాన్ పురిలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నిండా 20 ఏళ్లు నిండని ఇద్దరు యువకులు మరణించారు. మరో 20 ఏళ్ల యువకుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే... రాహుల్ 20 ఏళ్ల యువకుడు. సంజయ్ అనే మరో 20 ఏళ్ల యువకుడికి రూ.300 అప్పుగా ఇచ్చాడట. అప్పుగా తీసుకున్న మూడొందల రూపాయలను తిరిగి ఇచ్చేయమని సంజయ్ ని అడిగేందుకు రాహుల్, తన మిత్రుడు సచిన్ ను వెంటబెట్టుకుని వెళ్లాడు. ఈ సందర్భంగా వారి మధ్య మాటామాటా పెరిగింది. ఒకానొక దశలో ఆగ్రహంతో ఊగిపోయిన రాహుల్, సంజయ్ పై కత్తితో దాడి చేశాడు. బాధతో సంజయ్ పెట్టిన కేకలు తన ఇద్దరి అన్నలు, తండ్రికి వినిపించాయి. పరుగున వచ్చిన వారు, సంజయ్ ని రక్తపు మడుగులో చూసి, రాహుల్, సచిన్ లపై దాడికి దిగారు. అనంతరం గాయపడ్డ ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. రాహుల్, సంజయ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. గాయాలపాలైన సచిన్ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంజయ్ తండ్రి, సోదరులను అరెస్ట్ చేశారు.