: రాష్ట్ర విభజనపై శ్వేత పత్రం విడుదల చేసిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విభజించినప్పుడు పార్టీలతో మాట్లాడకుండా ఇష్టానుసారం విభజించారని ఆరోపించారు. తెలుగువారి మధ్య ఐక్యతను దెబ్బతీశారని ఆయన పేర్కొన్నారు. విభజన తరువాత ఏర్పడే సమస్యల గురించి కనీస స్థాయిలో కూడా ఆలోచించలేదని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్ లాంటి నగరం కట్టాలంటే కనీసం 5 లక్షల కోట్ల రూపాయలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ విధానాల వల్లే సమస్యలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు పెరగడానికి ఎంత చేయాలో అంతా చేశారని అన్నారు. సమర్థ పాలనకు ఎలాంటి సంస్థలు అవసరమో చెప్పలేదు. రాజధాని ఎక్కడో చెప్పకపోవడం వల్ల ప్రజల్లో మరోసారి ఉద్యమాలు రేగే అవకాశం కల్పించారని అన్నారు. అన్ని పంపకాలు జనాభా ప్రాతిపదికన చేశామన్నవారు, తెలంగాణకు కొన్ని ప్రయోజనాలు ఎలా కట్టబెట్టారని ఆయన ప్రశ్నించారు. అప్పుడే చర్చలు జరిగి ఉంటే ఇప్పుడీ ఇబ్బందులు ఉండేవి కాదని ఆయన చెప్పారు. 9వ షెడ్యూల్ లో 90 సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 9, 10 షెడ్యూల్ లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రస్తావన లేదని ఆయన వెల్లడించారు. విభజన వల్ల జరిగే నష్టాలన్నీ ఆంధ్రప్రదేశ్ కే కలిగాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ రహస్యంగా చేసిన విభజన వల్ల పూర్తిగా సమస్యల్లో ముంచేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News