: అమిత్ షా జట్టులో ఆరెస్సెస్ కు పెరిగిన ప్రాధాన్యం
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నూతన కార్యవర్గంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలకు అధిక ప్రాధాన్యం లభించింది. గతంలో ఏ బీజేపీ అధ్యక్షుడి జట్టులో లేనంత మంది ఆరెస్సెస్ నేతలకు అమిత్ షా జట్టులో స్థానం దక్కింది. గత నెలలో పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, తన కొత్త జట్టును శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన జాబితాలో ఆరెస్సెస్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన రామ్ మాధవ్ కు ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. రామ్ మాధవ్ కు బీజేపీ కీలక బాధ్యతలు కట్టబెట్టనుందనే ఊహాగానాలు కూడా సాగిన సంగతి తెలిసిందే. రామ్ మాధవ్ తో పాటు ఆరెస్సెస్ నేపథ్యంతో బీజేపీలో చేరిన జగత్ ప్రకాశ్ నద్దా, రామ్ లాల్, మురళీధరరావులకు కూడా ప్రధాన కార్యదర్శుల పదవులు దక్కాయి. ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు ఏకంగా పార్టీ ఉపాధ్యక్ష్య పదవి దక్కింది. ఈయనా ఆరెస్సెస్ నేపథ్యం ఉన్నవారే. ఇదిలా ఉంటే, అమిత్ షా కొత్త కార్యవర్గంలో యువతకు పెద్ద పీట వేశారు. బీజేపీ ప్రస్తుత జాతీయ కార్యవర్గంలో 75 ఏళ్లకు పైబడ్డ వ్యక్తి ఒక్కరూ లేరని పార్టీ వర్గాల సమాచారం. మొత్తం కార్యవర్గ సభ్యుల్లో 85 శాతం మంది 60 ఏళ్ల లోపు వారే. మూడొంతుల్లో రెండొంతుల మంది కార్యవర్గ సభ్యులు 50 ఏళ్లలోపు వారేనట. కొత్త కార్యవర్గ కూర్పు యువతరం, అనుభవం మేళవింపుగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ మార్గదర్శనంలోనే పార్టీ కార్యవర్గ కూర్పు జరిగిందన్న వాదన బలంగానే వినిపిస్తోంది.