: రాష్ట్ర సర్కారే రాజధానిని ఎంపిక చేస్తుంది ... సలహాలిచ్చేందుకే శివరామకృష్ణన్ కమిటీ: మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మంత్రి నారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాజధానిని ఎంపిక చేసేది రాష్ట్ర ప్రభుత్వమే అని, శివరామకృష్ణన్ కమిటీ కేవలం సలహాలిచ్చేందుకేనని నారాయణ స్పష్టం చేశారు. నేడు కేశినేని నాని, కొనకళ్ళ సత్యనారాయణ, ఇతర అధికారులతో కలిసి ఆయన గన్నవరంలోని మేధా టవర్స్ ను పరిశీలించారు. ఏపీ సర్కారు కార్యకలాపాలను మేధా టవర్స్ కేంద్రంగా నడిపించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేధా టవర్స్ ను పరిశీలించిన నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రం మధ్యలో ఉందనే విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఎంచుకున్నామని, మేధా టవర్స్ ప్రభుత్వ కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. మరికొన్ని భవనాలను కూడా పరిశీలించామని తెలిపారు.