: దేశంలో త్వరలో యూనివర్సల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకం: వెంకయ్యనాయడు
దేశ వ్యాప్తంగా వైద్య సేవల కోసం త్వరలో యూనివర్సల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని కేంద్రం ప్రభుత్వం తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు ఉమ్మడి సహకారంతో వైద్య రంగంలో సేవలు మెరుగుపర్చాలన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటు కావాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడలోని సూర్యారావుపేటలో ఈరోజు కామినేని ఆసుపత్రిని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు వచ్చే రోజుల్లో మెడికల్ హబ్ గా తయారుకావాలన్నారు. వైద్యం చేయడం ఒక మహత్తర అవకాశం అని, ఆ అదృష్టం అందరికీ రాదని పేర్కొన్నారు. కాగా, ఏపీ ఇవాళ రెవెన్యూ లోటులో ఉందని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆయన చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తనవంతు సహయం చేస్తుందని చెప్పిన మంత్రి, ఆశావహ దృక్పథంతో ఏపీ ముందకెళ్లాలని సూచించారు. మరిన్ని పరిశ్రమలు ఇక్కడికి రావల్సి ఉందన్నారు. సమస్యలు సృష్టించుకుంటే అభివృద్ధి జరగదన్న వెంకయ్య, ఏపీకి సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. అంతేగాక రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు.