: ఇమ్రాన్ ఖాన్ కారుపై కాల్పులు... ఇస్లామాబాద్ లో ఉద్రిక్తత
నవాజ్ షరీఫ్ సర్కారుకు వ్యతిరేకంగా ర్యాలీగా బయల్దేరిన మాజీ క్రికెటర్, తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కారుపై కాల్పులు జరిగాయి. ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. శుక్రవారం గుజ్రాన్ వాలాలో ర్యాలీ కొనసాగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు తొలుత కాల్పులు జరిపి, ఆ తర్వాత రాళ్ళతో దాడికి దిగారు. ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దె దిగేవరకు ఇస్లామాబాద్ వీధులను ఆక్రమించి, నిరసన చేపట్టాలన్న ఉద్దేశంతో ఇమ్రాన్, ప్రముఖ మతగురువు తాహిర్ ఉల్ ఖాద్రి వేర్వేరుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలు ఇస్లామాబాద్ దిశగా సాగుతుండగా కాల్పుల ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భారీగా బలగాలను మోహరించారు.