: బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వద్దన్న మోడీ... ఢిల్లీలో హైఅలర్ట్
ఎర్రకోట నుంచి దేశ ప్రధాని ప్రసంగించే సమయంలో ఆయన చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉండటం గమనించే ఉంటాం. కానీ, ప్రస్తుత ప్రధాని మోడీ తన విశిష్టతను మరోసారి చాటుకున్నారు. తనకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వద్దని చెప్పారు. సెక్యూరిటీ ఏజన్సీలు వారించినప్పటికీ ఆయన వద్దన్నట్టు సమాచారం. దీంతో, చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాట్లు లేకుండానే జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. అయితే, ఈరోజు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశ ప్రధాని ప్రయాణించే 10 కిలోమీటర్ల మార్గం మొత్తం సీసీటీవీల గుప్పిట్లో ఉంది. ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. మానవరహిత డ్రోన్ విమానాలు ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాల్లో నిఘా వేసి ఉంచాయి. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. ఎర్రకోట చుట్టుపక్కల ఉన్న దాదాపు 350 బహుళ అంతస్తుల భవనాల్లో సెక్యూరిటీ, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ను ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు పహారా కాస్తున్నారు.