: ప్లేబోయ్ అంటే కొత్త సీసాలో పాత సారా: బీజేపీ
ప్లేబోయ్ పబ్ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ బీజేపీ మహిళా నేతలు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. దేశంలో ఎక్కడా అనుమతులు లేని ప్లేబోయ్ పబ్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినివ్వడం సరికాదని ఈ సందర్భంగా హోంమంత్రికి తెలిపారు. అనుమతులు పొందేందుకు షరతులకు ఒప్పుకున్నప్పటికీ, ప్లేబోయ్ తన నైజం వదులుకునే అవకాశం లేదని అన్నారు. ఏ రకమైన అశ్లీలత లేకుండా ఎక్కడైనా ప్లేబోయ్ పబ్ నడుపుతోందా? అని వారు ప్రశ్నించారు. షరతులతో ప్లేబోయ్ పబ్ కు అనుమతినివ్వడం అంటే కొత్త సీసాలో పాత సారాగా వారు అభివర్ణించారు. ఇప్పుడే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్లేబోయ్ పబ్ కు అనుమతినిచ్చి ప్రజలకు ఏ సందేశమివ్వాలని ప్రభుత్వం కోరుకుంటోందని వారు హోం మంత్రిని అడిగారు. తక్షణం ప్లేబోయ్ పబ్ అనుమతులు రద్దుచేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ మహిళా నేతలు సూచించారు.