: మళ్లీ మొదటికొచ్చిన పీపీఏల కథ... ఏపీఈఆర్సీకి ఉనికే లేదంటున్న ఏపీ సర్కారు


విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల ఉపసంహరణ కుదరదని... అవి అమలులో ఉన్నట్లేనని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఇచ్చిన తీర్పుపై ఏపీ సర్కార్ మండిపడుతోంది. అసలు ఏపీఈఆర్సీ ఉనికినే తాము గుర్తించడం లేదని... దాని ఆదేశాలను కూడా తాము పాటించబోమని తేల్చి చెబుతోంది. జులై నెలాఖరులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆగస్ట్ నెల ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ప్రత్యేకంగా కొత్త విద్యుత్తు నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విభజనకు పూర్వం ఏర్పాటైన ఏపీఈఆర్‌సీ ఆటోమేటిక్‌గా రద్దయినట్లేనని, రద్దయిన ఈఆర్‌సీకి తీర్పును ఇచ్చే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని ఏపీ సర్కార్ ప్రశ్నిస్తోంది. పైగా, అర్ధరాత్రి సమయంలో హడావుడిగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఏపీఈఆర్సీకి ఏమొచ్చిందని ప్రశ్నిస్తోంది. దీని వెనుక ఏపీఈఆర్సీకి వేరే ఉద్దేశాలు ఉన్నాయని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఏపీఈఆర్సీ తీర్పు నేపథ్యంలో, మంగళవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్‌ తదితరులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు వేర్వేరుగా విద్యుత్తు నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేసుకున్నాక... పీపీఏలపై ఏపీఈఆర్‌సీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబు ఈ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏర్పాటైన ఏపీఈఆర్‌సీ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు ఏమాత్రం చెల్లుబాటు కావనే అంచనాకు చంద్రబాబు, ఉన్నతాధికారులు వచ్చారు. ఏపీఈఆర్‌సీ తీర్పుపై హైకోర్టులో సవాల్‌ చేయాలా..? లేక విద్యుత్‌ నియంత్రణ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలా..? అనే అంశంపై చర్చించారు. ఈ అంశం కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని, అందువల్ల ఈ తీర్పును పరిగణనలోకి తీసుకోలేమంటూ హైకోర్టును ఆశ్రయించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

  • Loading...

More Telugu News