: ఎప్పుడూ సింహాలేనా చంపేది..!


అడవికి రారాజు సింహం. దాని దారుఢ్యం, భీతిగొలిపే రూపం దానికి ఆ హోదా అడక్కుండానే కట్టబెట్టాయి. ఏ జంతువైనా దీనిముందు బలాదూరే! కానీ, గుజరాత్ లోని ససాన్-గిర్ అటవీప్రాంతంలో సీన్ రివర్సైంది. 11 ఏళ్ళ వయసున్న ఓ ఆడసింహం చివరికి పశువుల మంద ఆగ్రహానికి బలైంది. ఈ విషయం ఎలా తెలిసిందంటే... ఫారెస్ట్ బీట్ గార్డు రాణా మోరీ విధుల్లో భాగంగా రౌండ్స్ కు వెళ్ళాడు. పొదల్లో ఓ సింహం పిల్లను చూసి ఆగాడు. అది విచిత్రంగా ప్రవర్తించడం చూసిన మోరీ దాన్ని అనుసరిస్తూ ఓ 30 మీటర్లు ముందుకు వెళ్ళగా, ఓ సింహం కళేబరం కనిపించింది. తీవ్రగాయాలతో పడి ఉందా జంతువు. ఈ విషయాన్ని మోరీ వెంటనే తన అధికారులకు తెలియజేశాడు. వారు ఆ సింహం దేహానికి పోస్ట్ మార్టం చేయించారు. పక్కటెముకలు విరిగిపోవడం, అంతర్గత రక్తస్రావం కారణంగా సింహం మరణించినట్టు పోస్ట్ మార్టంలో వెల్లడయ్యింది. దీంతో, పశువులే సింహాన్ని మట్టుబెట్టాయని నిర్ధారణకు వచ్చారు ఫారెస్ట్ అధికారులు. కాగా, సంఘటన స్థలానికి సమీప గ్రామం కొఠారియా వాసులు ఈ ఆడసింహాన్ని 'రూప' అని పిలుచుకునేవారట. ఈ ప్రాంతంలో ఇది ఒంటరిగా సంచరిస్తుండేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News