: మాట వినలేదని రైతుతో మూత్రం తాగించారు!
ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓ రైతు పట్ల అమానుషంగా ప్రవర్తించారు. తమ మాట వినలేదన్న కారణంతో అతడిని చితకబాది, మూత్రం తాగించారు. వివరాల్లోకెళితే... మెహ్రోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భౌరండా గ్రామంలో కాన్సీరాం అనే రైతు తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నాడు. అయితే, కొందరు గ్రామస్తులు అందుకు అభ్యంతరం చెప్పారు. అది వివాదాస్పద భూమి అని, సాగు చేయరాదని బెదిరించారు. దీంతో, కాన్సీరాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై మెహ్రోని స్టేషన్ ఆఫీసర్ విజయ్ సింగ్ తన ముందు హాజరుకావాలంటూ కాన్సీరాంను పిలిపించాడు. ఆ వివాదాస్పద భూమిలో వ్యవసాయం చేయొద్దని తొలుత మామూలుగానే చెప్పాడట. అందుకు ఆ రైతు నిరాకరించడంతో అతడిలోని పోలీస్ నిద్రలేచాడు. పై అధికారి ఆదేశాలందుకున్న కానిస్టేబుళ్ళు కాన్సీరాంను చితకబాదారు. కాగా, వారు తనను తీవ్రంగా కొట్టడమే గాకుండా, మూత్రం కూడా తాగించారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై కాన్సీరాం లలిత్ పూర్ ఎస్పీ విజయ్ యాదవ్ కు ఫిర్యాదు చేయగా, ఆయన వెంటనే స్పందించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించామని, సదరు అధికారి తప్పు చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.