: ముంబైలో ఎబోలా కేసు?
ప్రపంచ దేశాలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న ఎబోలా వైరస్ బారిన పడిన ఓ వ్యక్తికి ముంబై వైద్యులు చికిత్స అందిస్తున్నారన్న సమాచారం కలకలం రేపుతోంది. ఇటీవలే ఎబోలా ప్రబలిన నైజీరియా నుంచి ముంబై వచ్చిన లలిత్ కుమార్ అనే వ్యక్తికి వచ్చీ రాగానే వాంతులు మొదలైన నేపథ్యంలో నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించిన వైద్యులు, అతడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. అంతేకాక అతడి నుంచి సేకరించిన నమూనాలను పూణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సురేశ్ శెట్టి తెలిపారు. లలిత్ కుమార్ కు ఎబోలా సోకిందని ఇప్పటిదాకా నిర్ధారణ కాలేదని వైద్యులు చెప్పారు. ఇదిలా ఉంటే, ఆఫ్రికా నుంచి చెన్నై వచ్చిన వ్యక్తికి ఎబోలా సోకలేదని నిర్ధారణ కావడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. అతడి నమూనాలను పరిశీలించిన పూణె వైరాలజి ప్రయోగశాల, నమూనాల్లో ఎబోలా వ్యాధి లక్షణాలు లేవని తేల్చేసింది. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తూ సోమవారం బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు అమలులో ఉండే ఈ ఎమర్జెన్సీ నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల వద్ద వైద్య బృందాలను నియమిస్తున్నట్లు ప్రకటించింది.