: తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరైంది కాదు: ఆర్థిక మంత్రి యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. హైదరాబాదులోని సచివాలయంలో మాట్లాడుతూ... వివాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాలపై ఉందని ఆయన అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, విభజన చట్టాన్ని అందరూ గౌరవించాలని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరైంది కాదని ఆయన అన్నారు. కేసీఆర్ కు నచ్చినట్టుగానే విభజన చట్టాన్ని తయారుచేశారని, ఇప్పుడు ఆ బిల్లును ఎలా వ్యతిరేకిస్తారని ఆయన ప్రశ్నించారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు అని ఆయన నిలదీశారు. కనీసం అప్పుడు సవరణలు కూడా ప్రతిపాదించలేదని యనమల అన్నారు. రాజకీయ లబ్ధి పొందడానికే ప్రయత్నిస్తున్నారన్నారు. తెలుగు వారి మధ్య చిచ్చు పెట్టడం తగదని ఆయన హితవు పలికారు. ఏవైనా సమస్యలుంటే సమన్వయంతో పరిష్కరించుకోవాలని యనమల అన్నారు.