: ఏ ఒక్క వ్యక్తి కారణంగానో బీజేపీకి అధికారం రాలేదు: ఆరెస్సెస్ చీఫ్ భగవత్
భారతీయ జనతా పార్టీ గడచిన ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్క వ్యక్తి కారణంగానో బీజేపీకి విజయం సిద్ధించలేదని, జనం మార్పు కోరుకున్న కారణంగానే విజయం వరించిందని వ్యాఖ్యానించిన ఆయన, మోడీ బృందానికి ఝలక్ ఇచ్చారు. తద్వారా మోడీ ప్రభంజనం కారణంగానే పార్టీకి అఖండ విజయం సిద్ధించిందన్న విషయాన్ని ఇక విడనాడాలని ఆయన చెప్పకనే చెప్పినట్లైంది. పార్టీవల్లో, ఓ వ్యక్తి కారణంగానో మొన్నటి ఎన్నికల్లో బీజేపీ గెలవలేదన్న భగవత్, ప్రభుత్వం మారాలని జనం కోరుకున్నందునే పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించిందని చెప్పారు. విజయానికి కారణమని చెప్పుకుంటున్న పార్టీతో పాటు వ్యక్తి కూడా గతంలోనూ ఉన్నారు కదా.., మరి అప్పుడెందుకు విజయం సాధించలేదని ప్రశ్నలు సంధించిన భగవత్, అనవసర విషయాలను వదిలి పాలనను సమర్థవంతంగా నడిపే విషయంపై దృష్టి పెట్టాలని మోడీ సర్కారుకు చురకలంటించారు. గడచిన ఎన్నికల్లో బీజేపీ కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షాను ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా మోడీ అభివర్ణించిన మరునాడే భగవత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే మోడీ సర్కారు సరైన మార్గంలోనే పయనిస్తోందని చెప్పిన ఆరెస్సెస్ చీఫ్, పనితీరు బాగా లేకుంటే 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూడటం కూడా ఖాయమని కుండబద్దలు కొట్టారు. బీజేపీలో వ్యక్తి పూజకు పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలోనే భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.