: మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు కన్నుమూత
టీడీపీ నేత, మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా విశాఖలోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడి వైద్యుల సూచన మేరకు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చేర్చారు. అయినా, ఆరోగ్యం విషమించడంతో గత అర్ధరాత్రి ఆయన కన్నుమూశారు. సీనియర్ నేతగా అప్పలనాయుడుకి మంచి పేరు ఉంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 1999లో అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. అప్పలనాయుడు భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామమైన విజయనగరం జిల్లా లక్కవరకు కోట మండలం కాసాపేటకు తరలిస్తున్నట్టు ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.