: ప్లేబోయ్ క్లబ్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే జేబు నింపుకోండి!


ప్లే బోయ్ ఏం చేసినా సంచలనమే... ప్రపంచ వ్యాప్తంగా 40 క్లబ్బులు మాత్రమే కలిగిన సంస్థ. ప్లేబాయ్ అంటేనే యువతలో తియ్యటి, వెచ్చటి గుబులు రేగుతుంది. జల్సా పురుషులకు ప్లేబాయ్ అంటే మత్తెక్కించే చక్కటి మద్యానికి తోడు కళ్లముందు కదలాడే అందాల విందు. అందుకే ప్లేబాయ్ క్లబ్ పెట్టినా, మేగజైన్ విడుదల చేసినా హాట్ టాపిక్ కావాల్సిందే. ప్రపంచ వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన వాటా కలిగిన, సంప్రదాయానికి పెద్దపీట వేసే భారతదేశంలో ప్లేబాయ్ ప్రవేశించేందుకు చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. ఆటలు సాగక పేరు మార్చుకుని రిసార్టుగా గోవా సాగరతీరాన వెలిసింది. అక్కడ రేవ్ పార్టీలతో తలబొప్పి కట్టించుకుంటున్న ప్లేబాయ్ సొంత పేరుతో హైదరాబాదులో అడుగుపెట్టడం పెను సంచలనమే. ఇందులో ఎవరి పెట్టుబడులున్నాయో! అన్న గుసగుసలు కూడా వినబడుతున్నాయి. దేశంలోని మెట్రోనగరాల్లో ముందు వరుసలో ఉండే ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, చెన్నై, పూణేలలో అడుగుపెట్టలేకపోయిన ప్లేబోయ్ హైదరాబాదుకు సునాయాసంగా వచ్చేశాడని వ్యాపార దిగ్గజాలు ఆశ్చర్యపోతున్నారు. మరి ప్లేబోయ్ ఏం చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించిందో లోగుట్టు పెరుమాళ్లకెరుక. కాగా, నేడు (శనివారం) ప్రారంభం కానున్న ప్లేబోయ్ క్లబ్ లో ఓసారైనా అడుగుపెట్టాలనుకుంటున్నారా? అయితే మీ జేబులు ఫుల్లుగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఎందుకంటే డ్రెస్ కోడ్ ఉంటుంది. నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్లో రెండు ఫ్లోర్లలో ప్లేబోయ్ క్లబ్ నిర్వహిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ జంటలకు కేటాయించారు. యాజమాన్యం దీని ప్రవేశ రుసుము 4 వేల రూపాయలుగా నిర్ణయించింది. బాక్స్ ఏరియాగా పిలిచే మొదటి అంతస్తులో కేవలం ప్లేబోయ్ క్లబ్ సభ్యులకు మాత్రమే ప్రవేశం. ఇందులో ఇతరుల ప్రవేశం నిషిద్ధం. క్లబ్ సభ్యత్వ రుసుము అక్షరాలా 3 లక్షల రూపాయలు. దీనికి నిబంధనలు కూడా ఉంటాయండోయ్... మీరు పార్టీఫ్రీక్ అయితే పర్లేదు. చుట్టపు చూపుగా అప్పుడప్పుడు వెళ్తామంటే సభ్యత్వం హుళక్కే. అశ్లీలతే లక్ష్యంగా నిర్వహించే ప్లేబోయ్ క్లబ్ లో అశ్లీలతకు తావులేదని ఎండీ పరాగ్ సంఘ్వీ సన్నాయి నొక్కులు నొక్కారు. క్లబ్ మొదలైతే కానీ అసలు రంగు తెలీదు. కాగా, ప్లేబోయ్ ప్రారంభంపై సర్వత్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు ఆందోళన చేస్తామంటున్నాయి.

  • Loading...

More Telugu News