: ఈ లేడీ టీచర్ కంటే పిల్లలు ఎంతో నయం!
చిన్నారులు స్కూలు ఎగ్గొట్టడం తెలిసిందే. మహా అయితే ఒకరోజో, రెండ్రోజులో ఇంటివద్ద ఉంటారు. మరి ఈ టీచరమ్మ ఏం చేసిందో చూడండి..! మధ్యప్రదేశ్ లో సంగీత కాశ్యప్ అనే మహిళ టీచర్ 1990లో బయాలజీ టీచర్ గా నియమితురాలైంది. దేవాస్ అనే పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో విధుల్లో చేరిన సంగీత ఓ ఏడాది సజావుగానే బండి నడిపించింది. ఆ తర్వాత మూడేళ్ళు లాంగ్ లీవ్ పెట్టింది. అనంతరం 1994లో ఆమెను ఇండోర్ లో ఓ పాఠశాలకు బదిలీ చేశారు. అక్కడా సేమ్ సీన్! ఆ పాఠశాలలో చేస్తూ మెటర్నటీ లీవ్ పెట్టిన ఆమె, ఆ తర్వాత మరి హాజరవలేదు. సంగీత చిరునామాకు ఎన్నో మెమోలు పంపినా ప్రత్యుత్తరం లేదు. రికార్డుల్లో 'అబ్సెంట్' రిమార్క్ వేశారు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని తాము రాష్ట్ర విద్యా శాఖ వర్గాలను లిఖిత పూర్వకంగా కోరామని ఓ అధికారి పేర్కొన్నారు. కాగా, సంగీత ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో ఇప్పటివరకు తెలుసుకోలేకపోయిందట మధ్యప్రదేశ్ విద్యాశాఖ.