: చంద్రబాబుకు రెండు నెలల ప్రోగ్రస్ కార్డ్ ను సబ్ మిట్ చేసిన మంత్రి
లంచం తీసుకోకుండా పనిచేస్తానని... దేవుడి ముందు ప్రమాణం చేశానని చెప్పి... సంచలనం సృష్టించిన ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తాజాగా మరో కొత్త ట్రెండ్ కు నాంది పలికారు. ఈ రెండు నెలల్లో తాను... తన శాఖ చేసిన పనులను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ప్రగతి నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఏపీకి 950 మెడికల్ సీట్లు సాధించామని తెలిపారు. గుంటూరులో ఎయిమ్స్ కు 180 ఎకరాల స్థలాన్ని పరిశీలించామన్నారు. త్వరలో గుంటూరు, విశాఖ జిల్లాల్లో క్యాన్సర్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించానన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రి స్థాయి సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామని కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.