: అర్జున అవార్డు ఎంపిక కమిటీ అధ్యక్షుడిగా కపిల్ దేవ్


దేశంలో క్రీడాకారులకిచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డుల్లో 'అర్జున' పురస్కారం ప్రముఖమైనది. ఈ అవార్డు అందుకోవడాన్ని క్రీడాకారులు గర్వంగా భావిస్తారు. కాగా, ఈ ఏడాది అర్జున అవార్డు ఎంపిక కమిటీకి లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ నేతృత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజిత్ శరణ్ ప్రకటించారు. కాగా, ద్రోణాచార్య అవార్డుల ఎంపిక కమిటీకి భారత హాకీ మాజీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్ నాయకత్వం వహిస్తారు. క్రీడల శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే కోచ్ లకు ద్రోణాచార్య పురస్కారం అందిస్తారు. ఈ క్రీడా అవార్డులను ఆగస్టు 29న జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తారు. అవార్డులకు అర్హులైన క్రీడాకారుల విషయమై ఆయా క్రీడాసంఘాలు నామినేషన్లను క్రీడల మంత్రిత్వ శాఖకు పంపాయి. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులుంటారు. వారిలో 12 మంది క్రీడారంగానికి చెందిన వ్యక్తులు కాగా, ముగ్గురు అధికారులు. ఆ ముగ్గురిలో ఒకరు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) డైరక్టర్ జనరల్ కాగా, మిగతా ఇద్దరు క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి. ఈ త్రయానికి రెండు కమిటీల్లోనూ స్థానం ఉంటుంది.

  • Loading...

More Telugu News