: 'నేను నీ సోదరుడిని... నిన్ను కాపాడే బాధ్యత నాది' అని మోడీ నాకు మాటిచ్చారు : కొత్తపల్లి గీత
లోక్ సభలో నిన్న తాను చేసిన ప్రసంగానికి మంచి ప్రతిస్పందన వచ్చిందని అరకు ఎంపీ కొత్తపల్లి గీత తెలిపారు. సభ్యులందరూ తన ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారని ఆమె పేర్కొన్నారు. ప్రసంగం ముగిసిన వెంటనే... తోటి మహిళా ఎంపీలు వచ్చి... తనకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతీ ఒక్కరి రక్షణకు చట్టాలు చేసే పార్లమెంట్... తనకు మద్దతు ప్రకటించడం ఆనందం కలిగించిందన్నారు. ఫేస్ బుక్ లో అసభ్యపదజాలంతో తనపై జరిగిన దాడిని ప్రధానమంత్రి మోడీ దృష్టికి కూడా తీసుకువెళ్లానని తెలిపారు. మోడీ కూడా తనకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. 'నేను నీ సోదరుడిని... నిన్ను కాపాడే బాధ్యత నాది' అని మోడీ తనకు మాటిచ్చారని కొత్తపల్లి గీత తెలిపారు.