: జగన్ కు పులివెందులలో కూడా క్రేజ్ తగ్గిందా?: వైసీపీ వర్గాల్లో హాట్ డిస్కషన్
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లాల్లో కూడా క్రేజ్ తగ్గిందా?... జగన్ ప్రజాకర్షణ శక్తి రోజురోజుకీ సన్నగిల్లుతోందా?... మాస్ జనాలలో జగన్ కు ఉన్న ఛరిష్మా తగ్గుముఖం పట్టిందా?... ఇప్పుడు ఇదే విషయంపై వైసీపీ వర్గాలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. వైసీపీ వర్గాల్లో ఈ చర్చ రావడానికి కారణం నిన్న జరిగిన ఓ సంఘటన. ఇంతకీ విషయమేమిటంటే, సాధారణంగా జగన్ వస్తున్నారంటేనే... పులివెందులలోని ఆయన కార్యాలయం భారీగా తరలివచ్చే జనాలతో కిటకిటలాడేది. జగన్ రాక కోసం ఎదురుచూస్తున్న భారీ జనసందోహంతో ఆయన కార్యాలయం ఓ జాతరను తలపించేది. కానీ, గురువారం జగన్ పులివెందులలోని పార్టీ కార్యాలయానికి వస్తున్నారని ముందస్తు సమాచారం ఇచ్చినా పెద్దగా జనాలు రాలేదు. గురువారం జగన్ వచ్చిన తరువాత కూడా... పార్టీ కార్యాలయం ఆవరణ ఖాళీగా బోసిపోయి ఉండడం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను బాగా ఆశ్చర్యపరిచింది. జగన్ ఉన్న గది దగ్గర మాత్రం కేవలం పదుల సంఖ్యలో అనుచరులు ఉన్నారు. సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఎదురవడం పట్ల వైసీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.