: టీమిండియాలో మాజీ కానిస్టేబుల్ కొడుకు
ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు గాను టీమిండియాకు ఎంపికైన క్రికెటర్లలో సంజూ శాంసన్ ఒకడు. ఈ కేరళ కుర్రాడు తొలిసారి 'అంతర్జాతీయ' గడప తొక్కనున్నాడు. భారత జట్టుకు ఎంపికైనట్టు ప్రకటన వెలువడగానే ఈ యువ క్రికెటర్ ఆనందానికి హద్దుల్లేకుండాపోయాయి. శాంసన్ తండ్రి విశ్వనాథ్ సంగతి సరేసరి. ఆ సమయంలో ఆయన ఫుట్ బాల్ కోచింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ వార్త చెవినబడిన వెంటనే, ఈ శుభవార్తను నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. సాయంత్రానికి కాస్తంత వాస్తవంలోకి వచ్చిపడ్డానని వివరించారు. కాగా, విశ్వనాథ్ ఢిల్లీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేశారు. పెద్దకొడుకు శాలీ శాంసన్ కాగా, రెండో కుమారుడే సంజూ. వీరిద్దరినీ ప్రణాళికాబద్ధంగా పెంచారాయన. సోదరులిద్దరూ ఢిల్లీలోనే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నారు. అయితే, ఆరేళ్ళ క్రితం సంజూ ఢిల్లీ అండర్-13 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో, ఆలోచనలో పడ్డ విశ్వనాథ్ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించి స్వరాష్ట్రం కేరళకు మకాం మార్చాడు. విళింజంలో స్థిరపడ్డాడు. తదనంతరకాలంలో సంజూ కేరళ రంజీ జట్టులో స్థానం సంపాదించాడు. అంతకుముందు అంతర్ జిల్లా పోటీల్లో కేవలం 55 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. అదే ఏడాది కర్ణాటకలో జరిగిన అండర్ 13 టోర్నీలో 900 పైచిలుకు పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడీ వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్. సంజూ ప్రస్థానంపై విశ్వనాథ్ మాట్లాడుతూ, తనయుడు ఢిల్లీ జట్టుకు ఎంపిక కాకపోవడంతో భయపడ్డానని, అందుకే కేరళ బాటపట్టానని తెలిపాడు.