: 'కోటీ'శ్వర్రావుల జాబితాలో భారత్ కు ఎనిమిదో స్థానం
భారత్ ఎదుగుతోంది! దేశంలో కోటీశ్వరుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ విడుదల చేసిన కుబేరుల జాబితాలో భారత్ కు ఎనిమిదో స్థానం లభించడం విశేషం. ఈ వరుసక్రమంలో ఆస్ట్రేలియా, రష్యా, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలు సైతం భారత్ వెనుకే. మనకంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ, యూకే, జపాన్, స్విట్జర్లాండ్, హాంకాంగ్ ఉన్నాయి. అధ్యయనం ప్రకారం భారత్ లో 14,800 మంది కుబేరులు ఉన్నారట. అటు, మల్టీ మిలియనీర్లు ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో మన ముంబయి టాప్-30లో చోటు దక్కించుకోవడం విశేషం. ముంబయిలో 2700 మంది కుబేరులు ఉన్నారు. సుమారు రూ.600 కోట్ల వ్యక్తిగత నెట్ వర్త్ ను ప్రాతిపదికగా తీసుకుని సంపన్నుల సంఖ్యను లెక్కగట్టారు. ఇక, అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో 1,83,500 మంది కుబేరులు ఉన్నారు. చైనాలో 26,600, జర్మనీలో 25,400, యూకేలో 21,700, జపాన్ లో 21,000, స్విట్జర్లాండ్ లో 18,300, హాంకాంగ్ లో 15,400 మంది కోటీశ్వర్రావులు ఉన్నారని న్యూ వరల్డ్ వెల్త్ వెల్లడించింది.